Nandyala Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం

Nandyala Road Accident Three Burnt Alive in Horrific Crash
  • నంద్యాల జిల్లాలో టైరు పేలి లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
  • ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లతో సహా ముగ్గురు సజీవ దహనం
  • బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కాపాడిన డీసీఎం డ్రైవర్
  • సురక్షితంగా బయటపడ్డ 36 మంది ప్రయాణికులు.. పది మందికి గాయాలు
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లతో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే, ఓ డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతున్న ఏఆర్‌బీసీవీఆర్‌ ట్రావెల్స్ బస్సు, శిరివెళ్లమెట్ట వద్దకు రాగానే దాని టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ డీసీఎం డ్రైవర్ దైవదూతలా స్పందించాడు. తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు దూకాలని అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా కిటికీల నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.

ఈ క్రమంలో పది మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైంది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్‌ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే మృతుల సంఖ్య భారీగా ఉండేదని అధికారులు, ప్రయాణికులు చెబుతున్నారు. 
Nandyala Road Accident
Road Accident
Andhra Pradesh
Bus Accident
Fire Accident
Nellore
Hyderabad
Nandyala

More Telugu News