రౌడీలా ప్రవర్తిస్తున్నాడంటూ ట్రంప్ పై మండిపడ్డ యూకే ఎంపీ

  • అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడన్న ఎంపీ ఎడ్ డేవీ 
  • బహుమతులు ఇస్తూ పొగుడుతుంటే ఆయన అహం శాంతిస్తుందని ఎద్దేవా 
  • తాను కోరుకున్న దానిని బలప్రయోగంతో లాక్కోవాలని చూస్తున్నారని విమర్శ 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై యూకే పార్లమెంట్ సభ్యుడు ఎడ్ డేవీ తీవ్రంగా మండిపడ్డారు. గ్రీన్ లాండ్ విషయంలో ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిలా కాదు అంతర్జాతీయ రౌడీలా, గ్యాంగ్ స్టర్ లా ప్రవర్తిస్తున్నాడు. తాను కోరుకున్నది ఏదైనా సరే బలప్రయోగంతో లాక్కోవాలని చూస్తున్నాడు. అమెరికా చరిత్రలోనే ట్రంప్ అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడు’ అంటూ యూకే పార్లమెంట్ లో వ్యాఖ్యానించారు.

ట్రంప్ అహాన్ని శాంతింపజేయాలంటే ముందుగా ఆయనకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలని, ఎంతసేపూ ఆయనను పొగడాలని అన్నారు. ప్రపంచంలో అందరూ తనను పొగడాలని భావిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ప్రైవేట్ జెట్ ల వంటి ఖరీదైన కానుకలిస్తూ, ఆయన క్రిప్టో ఖాతాలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడితే ట్రంప్ సానుకూలంగా ఉంటారని విమర్శించారు. గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నాన్ని తప్పుబట్టిన దేశాలపై టారిఫ్ లు విధిస్తానంటూ ట్రంప్ చేసిన బెదిరింపులు, ఈయూ దేశాలపై ఇప్పటికే విధించిన సుంకాలను తప్పుబడుతూ డేవీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ టారిఫ్ యుద్ధంతో పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలై లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే ట్రంప్ ఇదేమీ పట్టించుకోకుండా గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమంటూ మాట్లాడడం సరికాదని అన్నారు. ఎవరేమైనా, ఏదేమైనా తాను కోరుకున్నది తనకు దక్కాలని భావించడం రౌడీయిజమేనని మండిపడ్డారు.


More Telugu News