ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

  • ‘మైనర్ ఎలక్ట్రికల్ ఇష్యూ’ అంటూ వైట్ హౌస్ ప్రకటన
  • దావోస్ కు బయలుదేరిన విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్
  • ఆండ్రూస్ ఎయిర్ బేస్ లో క్షేమంగా దిగిన  ఎయిర్ ఫోర్స్ వన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ సమిట్ లో పాల్గొనేందుకు ట్రంప్ మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం) బయలుదేరారు. 

అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్ వాషింగ్టన్ నుంచి బయలుదేరిన కాసేపటికే అందులో సాంకేతిక లోపం ఏర్పడిందని, ట్రంప్ విమానం వెనక్కి మళ్లిందని వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్ ఫోర్స్ వన్ ను వెనక్కి రప్పిస్తున్నామని, ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ట్రంప్ విమానం క్షేమంగా ల్యాండ్ అయిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లీవిట్ తెలిపారు. విమానంలో మైనర్ ఎలక్ట్రిక్ ఇష్యూ ఏర్పడిందని చెప్పారు. మరో విమానంలో ట్రంప్ దావోస్ కు వెళతారని ఆమె వివరించారు. అయితే, ఎయిర్ ఫోర్స్ వన్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యకు సంబంధించి పూర్తి వివరాలను ఆమె వెల్లడించలేదు.


More Telugu News