గూగుల్ మ్యాప్స్‌లో చూసి గుళ్లకు కన్నం.. కాశీబుగ్గలో పోలీసులకు చిక్కిన హైటెక్ దొంగలు

  • శ్రీకాకుళం ఆలయ చోరీ కేసులో ఐదుగురు దొంగల అరెస్ట్
  • గూగుల్ మ్యాప్స్ వాడి ఆలయాలను టార్గెట్ చేస్తున్న ముఠా
  • రూ.40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం
  • రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితులు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.40.25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దొంగలు టెక్నాలజీని వాడుతూ, గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 9న ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని గమనించిన దొంగలు, కిటికీ తొలగించి లోపలికి ప్రవేశించారు. ఆలయంలోని 6.5 తులాల బంగారు నామం, వజ్రాలు పొదిగిన శంఖు చక్రాలు, 15 కిలోల వెండి ఆభరణాలతో పాటు హుండీలోని రూ.80 వేల నగదును అపహరించారు. ఈ ముఠా సభ్యులు చోరీకి ముందు, తర్వాత చాలా తెలివిగా వ్యవహరించారు. గూగుల్ మ్యాప్స్‌లో ఏ ఆలయాల్లో ఎక్కువ బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయో గుర్తించి వాటినే లక్ష్యంగా చేసుకున్నారు. చోరీ తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్‌ను తీసుకెళ్లి చెరువులో పడేశారు. పోలీసులు దానిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన నిందితులు గతేడాది అక్టోబరులో జైలు నుంచి విడుదలై, అప్పటి నుంచి రాష్ట్రంలో 50కి పైగా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు కురమాన శ్రీనివాసరావుపై 38 కేసులు, ఇతరులపై కూడా పదుల సంఖ్యలో కేసులున్నాయి. అరెస్ట్ అయిన వారిలో కురమాన శ్రీనివాసరావు, దార రమేశ్ కుమార్, సవర బోగేశ్‌, సవర సుదర్శనరావు, పుల్లేటికుర్తి చక్రధర్‌ ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆలయాల నిర్వాహకులు భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డీవీఆర్ బాక్స్‌ను సురక్షిత గదిలో ఉంచి, మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరచడం మేలని ఆయన తెలిపారు.


More Telugu News