వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది: వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి
- వాలంటీర్ల వల్ల ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగిందన్న బాల నాగిరెడ్డి
- ప్రజలకు నేరుగా తాము న్యాయం చేయలేకపోయామని వ్యాఖ్య
- మళ్లీ అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థను తిరిగి తీసుకురాబోమన్న ఎమ్మెల్యే
మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలోని వాలంటీర్ వ్యవస్థపై ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నమ్ముకోవడం వల్ల ప్రజలు – నాయకుల మధ్య దూరం పెరిగిందని, తాము నేరుగా ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఆయన అంగీకరించారు. “వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వాలంటీర్లపై అధికంగా ఆధారపడటం వల్ల ప్రజల సమస్యలు సకాలంలో తెలుసుకోలేకపోయామని, రాజకీయంగా నష్టపోయామని బాల నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా, ఈ వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో పార్టీ అధినేత జగన్‌పై కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ జగన్‌కు కార్యకర్తలతో కలవడానికి, ఫొటోలు దిగడానికి సమయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఈసారి అయినా కార్యకర్తలను నిరాశపరచకుండా సమయం కేటాయించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ‘2.0 వ్యవస్థ’ను అమలు చేసి, తమను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ ఆ విధానాన్ని అమలు చేయకపోతే, తన నియోజకవర్గంలో తానే అమలు చేస్తానని అన్నారు.