మూసీ వెంట 120 అడుగుల ‘మోడల్ కారిడార్’.. మారిపోనున్న రూపరేఖలు

  • ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేపు కీలక నిర్ణయం!
  • అంబర్‌పేట ఎస్టీపీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు భారీ రహదారి
  • రూ. 160 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
  • రేపు స్టాండింగ్ కమిటీ ముందుకు
  • ఉప్పల్ - వరంగల్ జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా నూతన మార్గం
  • మొదటి దశలో 2.7 కి.మీ మేర నిర్మాణం
  • పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు
భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూసీ తీరం వెంబడి 120 అడుగుల వెడల్పుతో అత్యాధునిక 'మోడల్ కారిడార్' నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రణాళికలు సిద్ధం చేసింది. అంబర్‌పేట ఎన్టీపీ (STP) నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు సాగే ఈ రహదారి నిర్మాణానికి రూ. 160 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదన రేపు జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చకు రానుంది.

తొలి దశలో ఉప్పల్ భగాయత్ వరకు: ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో ఎన్టీపీ నుంచి ఉప్పల్ భగాయత్ డీ-మార్ట్ వరకు 2.7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. ఈ మార్గంలో రామాంతపూర్ కేసీఆర్ నగర్ వద్ద ఉన్న నాలాపై కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తారు. కేవలం వాహనాల రాకపోకలకే కాకుండా, ఈ రహదారి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లు, సైకిల్ ట్రాక్‌లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నందున, కొంత మేర ఆస్తుల సేకరణ కూడా అవసరమని అధికారులు భావిస్తున్నారు.

వరంగల్ హైవేపై తగ్గనున్న ఒత్తిడి: ప్రస్తుతం గోల్నాక, అంబర్‌పేట, రామాంతపూర్ ప్రజలు సికింద్రాబాద్ లేదా వరంగల్ వైపు వెళ్లాలంటే ఉప్పల్ మెయిన్ రోడ్డుపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ కొత్త 120 అడుగుల రోడ్డు అందుబాటులోకి వస్తే, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఈ రహదారి నగరం రూపురేఖలను మార్చనుంది.

మూసీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విదేశీ నదుల అభివృద్ధి నమూనాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల భవిష్యత్తులో మూసీ నది ఆక్రమణలు కూడా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.


More Telugu News