నేల విషతుల్యమవుతోంది: సీపీఐ నారాయణ

  • సేంద్రియ వ్యవసాయంపై సదస్సులో పాల్గొన్న నారాయణ, చిన్న జీయర్ స్వామి
  • ప్రతి రైతు సేంద్రియ సాగు వైపు మళ్లాలన్న నారాయణ
  • అత్యాశ వల్ల ప్రకృతి నాశనం అవుతోందన్న జీయర్ స్వామి

నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రసాయన ఎరువులు, పురుగుల మందుల అధిక వినియోగంతో నేల విషతుల్యమవుతోందని, దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలాగే ప్రతి రైతు సేంద్రియ సాగు వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.


దేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నప్పటికీ యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని నారాయణ అన్నారు. విత్తనాలు, ఎరువుల కంపెనీలు కార్పొరేట్‌ల చేతుల్లో ఉండటంతో లాభాలు బడా కంపెనీలకే చేరుతున్నాయని విమర్శించారు. చివరి ఊపిరి వరకు కమ్యూనిస్టు పార్టీలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.


ఈ సదస్సులో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి కూడా పాల్గొని ప్రసంగించారు. భూమి పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అత్యాశ వల్ల ప్రకృతి సమూల నాశనం అవుతోందని హెచ్చరించారు. హైబ్రిడ్ సాగు, పశుపోషణ వల్ల రోగాలు పెరుగుతున్నాయని, నేటి ఆహారం ఎక్కువగా కలుషితమైందని తెలిపారు. ప్రకృతి బాగుంటేనే మనిషి జీవించగలడని, భూమికీ ప్రాణం ఉందని, దానికి కూడా విరామం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.



More Telugu News