కాలేజ్ రోజుల్లోనే కృష్ణగారిని దేవుడని పిలిచేవారు: మురళీమోహన్

  • కృష్ణతో పరిచయం గురించి ప్రస్తావించిన మురళీమోహన్ 
  • కాలేజ్ రోజుల్లోను మంచి మనిషిగా గుర్తింపు ఉందని వెల్లడి 
  • అక్కినేనిని చూసే సినిమాల్లోకి వెళ్లారని వివరణ 
  • 'అల్లూరి సీతారామరాజు' సినిమా గురించిన ప్రస్తావన  

సూపర్ స్టార్ గా కృష్ణ దూసుకుపోతున్న సమయంలోనే, కథానాయకుడిగా మురళీమోహన్ తన ప్రత్యేకతను చాటుతూ వెళ్లారు. అయితే నటన వైపుకు రావడానికి ముందు, ఏలూరులో ఒకే కాలేజ్ లో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలను ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ ప్రస్తావించారు. "కృష్ణగారు కాలేజ్ లో చేరే సమయానికి చాలా అందంగా ఉండేవారు. ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుండేది. నాగేశ్వరరావుగారి సినిమా ఫంక్షన్ ఒకటి ఆ కాలేజ్ గ్రౌండ్ లో జరిగింది. అప్పుడే తాను కూడా హీరో కావాలనే ఒక ఆలోచన కృష్ణగారికి వచ్చింది" అని అన్నారు.

"కృష్ణగారు చూడటానికి చాలా అమాయకంగా కనిపించేవారు. కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా ధైర్యంగా వ్యవహరించేవారు. కాలేజ్ లో అందరూ కూడా ఆయనను 'దేవుడు' అనే పిలిచేవారు. నిజంగానే ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా ఆయనను దేవుడనే పిలిచారు. కాలేజ్ ఆ పేరు ఎవరు పెట్టారోగానీ .. నిజంగానే కృష్ణగారు దేవుడనే అనిపించుకున్నారు. అందుకు నిదర్శనంగా చెప్పుకోవడానికి మనకి చాలా కారణాలు కనిపిస్తాయి" అని చెప్పారు. 

"కృష్ణగారు 'అల్లూరి సీతారామరాజు' సినిమాను పట్టాలెక్కించారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. ఫారెస్టు ఏరియాలో షూటింగును మొదలుపెట్టారు. మొదటి రోజునే రామచంద్రరావుగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ తరువాత ఆయన చనిపోయారు. దాంతో కృష్ణగారే దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. దర్శకుడిగా రామచంద్రరావు గారి పేరునే వేశారు. అంతేకాదు .. ఆయనకి ఇస్తానని చెప్పిన పారితోషికాన్ని ఆయన ఫ్యామిలీకి పంపించారు. కృష్ణగారి మంచి మనసుకు ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు" అని అన్నారు.



More Telugu News