వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

  • ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం
  • ఎవరిని విచారించాలనుకుంటున్నారో చెప్పాలని ఆదేశం
  • తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా? అనే అంశంపై సీబీఐని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రశ్నించింది. ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలనుకుంటున్నారో, ఏయే అంశాలపై మరింత విచారణ అవసరమో వివరంగా తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.


వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రయల్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, తమ పిటిషన్‌లో ప్రస్తావించిన కీలక అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. పిటిషన్‌లో లేని అంశాల ఆధారంగా పరిమిత స్థాయిలో మాత్రమే పాక్షిక దర్యాప్తుకు అనుమతిచ్చారని, ఇది న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా అనే విషయంపై సీబీఐ స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ, దర్యాప్తు అధికారితో చర్చించి పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల గడువు కావాలని తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.



More Telugu News