‘దండోరా’పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు.. ఓటీటీలో రికార్డుల మోత!

  • 'దండోరా' చిత్రంపై ప్రశంసలు కురిపించిన జూనియర్ ఎన్టీఆర్
  • ఇది లోతైన, శక్తిమంతమైన చిత్రమంటూ ఎక్స్ వేదికగా పోస్ట్
  • ఎన్టీఆర్ ప్రశంసలతో భావోద్వేగానికి లోనైన చిత్ర యూనిట్
  • ప్రైమ్ వీడియోలో ఇండియా టాప్-2 ట్రెండింగ్‌లో నిలిచిన సినిమా
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దండోరా’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ఎంతో లోతైన, శక్తిమంతమైన, ఆలోచింపజేసే చిత్రమని కొనియాడారు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆయన పంచుకున్నారు.

“ఇప్పుడే దండోరా సినిమా చూశాను. ఇంతటి బలమైన రచనతో, మన మూలాలకు దగ్గరగా ఉండే కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి నా హ్యాట్సాఫ్” అని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. ఇంత మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించిన నిర్మాత రవీంద్ర బెనర్జీకి, చిత్ర బృందానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్ వంటి అగ్ర నటుడి నుంచి ప్రశంసలు దక్కడంతో ‘దండోరా’ చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. “ఎన్టీఆర్ అన్న నా పేరు పలికారు. ఇది నాకు చాలు” అంటూ దర్శకుడు మురళీ కాంత్ భావోద్వేగానికి గురవ్వగా, ఇదే తమకు అసలైన విజయమని నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు.

గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఎన్టీఆర్ ప్రశంసలతో ఈ చిత్రానికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. ఫలితంగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా టాప్-2లో ట్రెండింగ్‌లో నిలుస్తూ రికార్డు సృష్టిస్తోంది.


More Telugu News