ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్

  • ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రానికే నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
  • తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వెల్లడి
  • యంత్రాంగం రాబోయే రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం రైతులకు మరో శుభవార్తను అందించింది. ఇకపై ధాన్యం కొనుగోలు చేసిన రోజే సాయంత్రానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు.

ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890 కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.9,800 కోట్లను 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలిస్తున్నామని మంత్రి తెలిపారు. తేమ శాతం, జీపీఎస్, రవాణా వంటి సమస్యలను సమర్థవంతంగా అధిగమించామని పేర్కొన్నారు.

రాబోయే రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే, గోతాలు, రవాణా, నిల్వ సౌకర్యాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఢిల్లీరావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 


More Telugu News