నోబెల్ రాకపోతే నాకేంటి? ఇకపై 'శాంతి' గురించి ఆలోచించను: నార్వే ప్రధానికి ట్రంప్ హెచ్చరిక

  • తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి 
  • నోబెల్ కమిటీ స్వతంత్రమైనదన్న నార్వే ప్రధాని
  • విజేతల ఎంపికలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టీకరణ
  • నోబెల్ రానందున ఇకపై శాంతి గురించి కాకుండా అమెరికా ప్రయోజనాలే చూస్తానన్న ట్రంప్
  • గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడం ఖాయమన్న అమెరికా అధ్యక్షుడు
తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి నార్వే ప్రభుత్వమే కారణమని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్‌కు ఘాటైన సందేశం పంపారు. "నేను ఎనిమిదికి పైగా యుద్ధాలను ఆపాను.. అయినా మీ దేశం నాకు నోబెల్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. కాబట్టి ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాపై లేదు. నా దృష్టి అంతా అమెరికా ప్రయోజనాలపైనే ఉంటుంది" అని ట్రంప్ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్ హుందాగా స్పందించారు. నోబెల్ బహుమతుల ఎంపిక పూర్తిగా స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తాను గతంలోనే ట్రంప్‌కు వివరించానని ఆయన తెలిపారు.

గ్రీన్‌లాండ్ దీవిని అమెరికా వశం చేసుకోవాలన్న ట్రంప్ పట్టుదలే ఈ వివాదానికి ప్రధాన కారణం. గ్రీన్‌లాండ్‌ను తమకు అప్పగించేలా డెన్మార్క్‌పై ఒత్తిడి తేవాలని నార్వే, ఫిన్లాండ్ వంటి దేశాలను ట్రంప్ కోరుతున్నారు. ఇందుకు నిరాకరిస్తున్న దేశాలపై ఫిబ్రవరి నుంచి 10 శాతం అదనపు టారిఫ్లు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్ అమెరికా నియంత్రణలో ఉండాలని, రష్యా-చైనాల నుంచి దాన్ని రక్షించే శక్తి డెన్మార్క్‌కు లేదని ట్రంప్ వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నాటో (NATO) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది.


More Telugu News