270 ఏళ్ల తర్వాత పూర్తిస్తాయిలో కేరళ కుంభమేళా

  • నీల నది తీరంలో మహా మాఘ మహోత్సవం ప్రారంభం
  • ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన గవర్నర్
  • చివరిసారి 1755లో పూర్తిస్థాయి మహోత్సవం జరిగినట్లు రికార్డులు
కేరళలోని తిరునావాయలో నీల నది తీరంలో కేరళ కుంభమేళాగా పిలిచే మహా మాఘ మహోత్సవం ప్రారంభమైంది. ఈ మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ సనాతన సంప్రదాయాన్ని, హిందూ ఆచారాలను ప్రశంసించారు. సనాతన సంప్రదాయాన్ని పాటించడం అంటే మరెవరికో వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. భారతదేశం అందరినీ తనలో కలుపుకుని ముందుకు సాగుతుందని అన్నారు.

నీల నదిని భరతపూజ నది అని కూడా అంటారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ మహా మాఘ మహోత్సవాన్ని సుమారు 270 సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. చివరి పూర్తిస్థాయి మహా మాఘ మహోత్సవం 1755లో జరిగిందని రికార్డులు వెల్లడిస్తున్నాయి. నేడు ప్రారంభమైన ఈ మాఘ మహోత్సవం ఫిబ్రవరి 3 వరకు 15 రోజుల పాటు కొనసాగుతుంది.

కేరళ, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానమాచరిస్తారు. ఈసారి సుమారు 50 వేల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మాఘ మహోత్సవం సందర్భంగా కేరళ ఆర్టీసీ సుమారు 100 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ పదిహేను రోజుల పాటు పాండిత్య చర్చలు, కలరిపయట్టు, యోగా, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.


More Telugu News