హర్యానాలో డ్రైవర్‌కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది!

  • సిర్సా జిల్లాలోని 35 ఏళ్ల డ్రైవర్‌ను మూడోసారి వరించిన అదృష్టం
  • రూ.500కు లోహ్రీ మకర సంక్రాంతి2026 లాటరీని కొనుగోలు చేసిన పృథ్వీ సింగ్
  • తన పిల్లల భవిష్యత్తు కోసం ఈ నగదును ఉపయోగిస్తానని వెల్లడి
హర్యానా రాష్ట్రం, సిర్సా జిల్లాలోని ముహమ్మద్‌పురియా గ్రామంలో ఒక డ్రైవర్ పది కోట్ల రూపాయల భారీ లాటరీని గెలుచుకున్నాడు. 35 సంవత్సరాల పృథ్వీ సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి, సోదరుడు ఉన్నారు. భార్య స్థానిక పాఠశాలలో ఫ్యూన్‌గా పనిచేస్తోంది. పృథ్వీ సింగ్ తండ్రి కూడా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

పృథ్వీ సింగ్ రూ.500 వెచ్చించి పంజాబ్ లోహ్రీ మకర సంక్రాంతి 2026 లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ లాటరీలో అతడికి మొదటి బహుమతిగా రూ.10 కోట్లు లభించాయి. తాను లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయడం ఇది మూడవసారి అని పృథ్వీ సింగ్ తెలిపాడు. ఈసారి తనకు అదృష్టం కలిసి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.

ఇంతకుముందు రెండుసార్లు కొనుగోలు చేసినప్పటికీ, తనకు ఈసారి లాటరీ తగులుతుందని ఎప్పుడూ అనుకోలేదని అన్నాడు. లాటరీ ద్వారా వచ్చిన నగదును పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని పృథ్వీ సింగ్ వెల్లడించారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక లగ్జరీ కారు కొనివ్వమని తన తండ్రిని అడుగుతానని పృథ్వీ సింగ్ ఆరేళ్ల కుమారుడు దక్ష్ చెప్పారు.


More Telugu News