ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... మరణించిన ఆరుగురు మావోయిస్టుల గుర్తింపు
- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్
- ఈ నెల 17 ఉదయం నుంచి 18 సాయంత్రం వరకు కాల్పులు
- మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో భద్రతా బలగాలు మరో కీలక విజయాన్ని సాధించాయి. భోపాలపట్నం-ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇంచార్జ్ డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా మొత్తం ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టుల కదలికలపై అందిన నమ్మకమైన సమాచారంతో డీఆర్‌జీ బీజాపూర్, డీఆర్‌జీ దంతేవాడ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు (202, 206, 210 బెటాలియన్లు), సీఆర్‌పీఎఫ్ 214 బెటాలియన్‌కు చెందిన సంయుక్త బృందాలు ఈనెల 17న ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో జనవరి 17 ఉదయం నుంచి 18 సాయంత్రం వరకు మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.
మృతులను దిలీప్ బెంజా (రివార్డు రూ.8 లక్షలు), మాధవి కోసా (రూ.5 లక్షలు), పాలో పోడియం (రూ.5 లక్షలు), లఖీ మద్కం (రూ.5 లక్షలు), జుగ్లో బంజం (రూ.2 లక్షలు), రాధా మెట్ట (రూ.2 లక్షలు)గా గుర్తించారు. వీరిపై మొత్తం రూ.27 లక్షల రివార్డు ఉందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పత్తిలింగం తెలిపారు. కీలక నేత దిలీప్ బెంజాపై బీజాపూర్ జిల్లాలో 135 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఘటనాస్థలంలో నుంచి రెండు ఏకే-47లు, ఒక ఇన్సాస్, రెండు 0.303 రైఫిళ్లు, ఒక కార్బైన్‌తో పాటు పేలుడు పదార్థాలు, వైర్‌లెస్ సెట్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. దిలీప్ బెండ్జాపై 135కు పైగా కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.