సుధా కొంగరపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్.. చివరకు తగ్గిన సుధ!
- విడుదల వాయిదా పడ్డ విజయ్ సినిమా 'జననాయగన్'
- సొంత సినిమా ప్రమోషన్లలో సుధ బిజీ
- సుధను టార్గెట్ చేసిన విజయ్ ఫ్యాన్స్
- తాను విజయ్ కు పెద్ద అభిమానినని చెప్పిన సుధ
టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర పేరు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. శివ కార్తికేయన్‌తో తెరకెక్కించిన ‘పరాశక్తి’ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇదే సమయంలో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో, విడుదల వాయిదా పడింది.
ఈ క్రమంలో విజయ్ సినిమా గురించి ఏమాత్రం స్పందించకుండా... తన సినిమా ప్రమోషన్లో సుధ బిజీగా ఉండటంతో... ఆమెను విజయ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. తమ హీరో సినిమాను పక్కన పెట్టి తన సినిమాను ప్రమోట్ చేస్తున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మొదట ఆమె కూడా ఆ ట్రోల్స్ పట్ల ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత విమర్శలు ఎక్కువ కావడంతో ఓ ఇంటర్వ్యూలో వివాదం ముగిసేలా స్పందించారు.
ఇంటర్వ్యూలో సుధ ఓ ఆసక్తికర విషయాన్ని వివరించారు. తాను విజయ్‌కు పెద్ద అభిమానినని, ఆయన సినిమా విడుదలైతే ఫస్ట్ డే ఫస్ట్ షో తప్పకుండా చూస్తానని చెప్పారు. విజయ్ లాంటి స్టార్‌తో పోటీ పడాలనే ఆలోచన తనకు లేదని, పండగ సీజన్ కావడంతోనే ‘పరాశక్తి’ రిలీజ్ అయ్యిందని తెలిపారు. ‘జన నాయగన్’ వాయిదా పడటం బాధాకరమని, ఏ సినిమాకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. సుధా కొంగర వ్యాఖ్యలతో ట్రోల్స్ తగ్గిపోయాయి. నెటిజన్ల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది.