నీతులు చెప్పే డీజీపీ ఖాకీ బుక్ ఎక్కడకు వెళ్లింది?: హరీశ్ రావు
- ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా? అన్న హరీశ్ రావు
- కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై మౌనం వహిస్తున్నారని విమర్శ
- జర్నలిస్టులు, బీఆర్ఎస్ నేతలపై మాత్రం సిట్ లు వేస్తున్నారని మండిపాటు
కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై పోలీసులు మౌనం పాటించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. చట్టం అందరికీ సమానమని చెబుతూ నీతులు చెప్పే డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్ ఇప్పుడు ఎక్కడికెళ్లిందని ఎద్దేవా చేశారు. “ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలంపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఏఐసీసీ నేత, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కాంట్రాక్టర్లను రూ.8 కోట్లు ఇవ్వాలని బెదిరించాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్వయంగా బాధిత కాంట్రాక్టరే ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ ఎందుకు వేయలేదని నిలదీశారు. జర్నలిస్టులు, బీఆర్ఎస్ నేతలపై మాత్రం సిట్‌లు, కమిషన్లు వేస్తారని, కాంగ్రెస్ నేతల విషయంలో ఎందుకు నిబంధనలు మారతాయని హరీశ్‌రావు మండిపడ్డారు.
జర్నలిస్టుల కేసులో సిట్ ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని చెబుతున్నారని, అదే నిజమైతే ఆయన ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమైనట్టే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిపాలన బాధ్యత వహించే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టాన్ని రాజకీయాల కోసం వాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు హెచ్చరించారు.