గ్రీన్ లాండ్ స్వాధీనంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

  • ఇరవై ఏళ్లుగా చెబుతున్నాం.. ఇప్పుడు టైమొచ్చిందన్న ట్రంప్
  • తమ సూచనలను డెన్మార్క్ పెడచెవిన పెట్టిందని విమర్శ
  • ఇన్నాళ్లుగా వేచి చూశాం.. ఇక తమ నియంత్రణలోకి తీసుకుంటామని వ్యాఖ్య
గ్రీన్ లాండ్ విషయంలో గడిచిన ఇరవై సంవత్సరాలుగా డెన్మార్క్ ను నాటో హెచ్చరిస్తూనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని చెబుతున్నా డెన్మార్క్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇరవై ఏళ్లుగా తాము వేచి చూస్తూనే ఉన్నామని చెబుతూ.. ఇప్పుడు తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

గ్రీన్ లాండ్ స్వాధీనం విషయంలో తన వైఖరిని సమర్థించుకుంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. గ్రీన్ లాండ్ ను తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. రష్యాను ఎదుర్కోవడంలో డెన్మార్క్ విఫలం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా తాము ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సమయం వచ్చింది కాబట్టే ఈ విషయంలో తాము కల్పించుకున్నామన్నారు.

ఎలాగైనా గ్రీన్‌లాండ్‌ ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆదివారం ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు. కాగా, ఈ విషయంలో తమ వైఖరిని వ్యతిరేకించే దేశాలపై టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్.. అన్నట్లుగానే ఈయూ కూటమిలోని 8 దేశాలపై 10 శాతం టారిఫ్ లు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ టారిఫ్ లు అమలులోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు.


More Telugu News