ఏఆర్ రెహ్మాన్‌పై జాలి చూపించడం సరికాదు.. రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు

  • ఏఆర్ రెహ్మాన్ వ్యాఖ్యలపై స్పందించిన రచయిత్రి తస్లీమా నస్రీన్
  • రెహ్మాన్ చాలా ధనవంతుడు, ప్రఖ్యాత వ్యక్తి అని వ్యాఖ్య
  • ఆయనకు మత వివక్ష ఎదురయ్యే అవకాశం లేదన్న తస్లీమా
  • తనలాంటి పేదవాళ్లకే అసలైన కష్టాలు తప్పవని ఆవేదన
  • రెహ్మాన్, షారుఖ్, సల్మాన్ లాంటి వారు సూపర్‌స్టార్లని వ్యాఖ్య
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇటీవల చేసిన మతపరమైన వ్యాఖ్యల వివాదంపై ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన అంశం కూడా ఒక కారణం కావచ్చని రెహ్మాన్ పేర్కొనగా, ఆ వాదనను తస్లీమా తోసిపుచ్చారు. రెహ్మాన్ స్థాయిలోని అత్యంత ధనవంతులు, ప్రఖ్యాత వ్యక్తులకు ఇలాంటి వివక్ష ఎదురయ్యే అవకాశం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు. "ఏఆర్ రెహ్మాన్ ఒక ముస్లిం. భారతదేశంలో అసాధారణమైన కీర్తి ప్రతిష్ఠ‌లు సంపాదించారు. అందరు కళాకారుల కంటే ఆయన పారితోషికం ఎక్కువని నేను విన్నాను. ఆయన అత్యంత ధనవంతుడైన సంగీత విద్వాంసుడు కావచ్చు. అలాంటి వ్యక్తి ముస్లిం అయినందుకే బాలీవుడ్‌లో పని దొరకడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు" అని ఆమె పేర్కొన్నారు.

"షారుఖ్ ఖాన్ ఇప్పటికీ బాలీవుడ్ బాద్‌షా. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, జావేద్ అక్తర్, షబానా అజ్మీ.. వీరంతా సూపర్‌స్టార్లే. ధనవంతులు, ప్రసిద్ధులు ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోరు. రెహ్మాన్‌ను హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు, నాస్తికులు అనే తేడా లేకుండా అందరూ గౌరవిస్తారు. ఆయనపై జాలి చూపించడం సరికాదు" అని తస్లీమా రాసుకొచ్చారు. తనలాంటి పేదవాళ్లకే అసలైన కష్టాలు తప్పవని, తన పేరు కారణంగా నాస్తికురాలైనా తనను ముస్లింగానే చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే.. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెహ్మాన్ కూడా స్పందించారు. తాను ఎవరినీ బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, భారతదేశం తన ఇల్లు, ప్రేరణ అని, ఇక్కడ సృజనాత్మక స్వేచ్ఛకు ఎంతో విలువ ఉందని ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.


More Telugu News