వైసీపీ అధికారంలోకి రాగానే నారా లోకేశ్ ను అరెస్ట్ చేస్తాం: లక్ష్మీపార్వతి
- ఎన్టీఆర్ పై చంద్రబాబుకు గౌరవం లేదన్న లక్ష్మీపార్వతి
- ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించడంలో వెనకడుగు వేస్తున్నారని మండిపాటు
- తమ ప్రభుత్వం రాగానే లోకేశ్ పై ఎంక్వైరీ కమిషన్ వేస్తామని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోసాలు, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, ఇవన్నీ ఆయనకు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుతో రాజకీయాలు చేయడం తప్ప, నిజంగా ఆయనపై ప్రేమ, గౌరవం చంద్రబాబుకు లేవని ఆరోపించారు.
ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఇస్తున్న హామీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని లక్ష్మీపార్వతి అన్నారు. ఇతర రాష్ట్రాల నాయకులు తమ రాష్ట్రానికి చెందిన మహానీయులకు భారతరత్న ఇప్పించేందుకు కేంద్రంపై పోరాటం చేస్తుంటే... ఎన్టీఆర్ లాంటి మహానాయకుడి విషయంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే, కేంద్రంపై ఒత్తిడి చేసి భారతరత్న ఇప్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హత్యలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, దీనికి కూటమి ప్రభుత్వమే కారణమని అన్నారు. మంత్రి నారా లోకేశ్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనపై ఎంక్వైరీ కమిషన్ వేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. లోకేశ్ ను జైల్లో పెడతామని అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. దుర్మార్గులకు అండగా నిలవడం అన్యాయమని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.