బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేసిన కాంట్రాక్టర్.. ఇదిగో వీడియో!

  • 'మన ఊరు-మన బడి' బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ నిరసన
  • నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరులో ప్రభుత్వ పాఠశాలకు తాళం
  • రెండేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ ఆవేదన
  • తాళం వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు
'మన ఊరు-మన బడి' పథకం కింద నిర్మించిన పాఠశాల భవనానికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ దానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... సురేశ్‌ అనే కాంట్రాక్టర్ 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా రెండేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. లక్షల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పాఠశాల భవనానికి తాళం వేశారు. వెంటనే బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని సురేశ్‌ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ గేటుకు తాళం వేయడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు.


More Telugu News