Chandrababu: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం

Chandrababu Davos Visit Focuses on AP Investment Opportunities
  • దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
  • పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ బృందం పర్యటన
  • గ్రీన్ ఎనర్జీ, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి
  • వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పోరాతో సమావేశాలు
  • మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్ తో కలిసి పర్యటిస్తున్న సీఎం
ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు. కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి దావోస్ వెళ్లి నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొంటారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉన్నారు.

ఈ ఏడాది డ‌బ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు రికార్డు స్థాయిలో సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు, 60 దేశాల ప్రభుత్వ అధినేతలు హాజరవుతారని అంచనా. భారతదేశం నుంచి ఏడుగురు ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించేందుకు ఏపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా రూపొందించింది.

ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వీటితో పాటు టూరిజం, హాస్పిటాలిటీ, విద్య, వైద్య రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నూతన పాలసీలను ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఎం బృందం వివరించనుంది.

ముఖ్యంగా అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' ఏర్పాటు, లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేసేందుకు చేపట్టిన 'అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్' కోర్సు గురించి సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఇప్పటికే ఈ కోర్సులో 50 వేల మంది నమోదు చేసుకున్న విషయాన్ని పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే, కాకినాడలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమోనియా-గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ ప్రాజెక్టును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.

గతేడాది (2025) జరిగిన డ‌బ్ల్యూఈఎఫ్ సదస్సులో జరిపిన చర్చల ద్వారా ఏపీ సుమారు రూ.2.36 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగింది. ఈసారి అంతకుమించిన పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యటన తొలి రోజే సీఎం చంద్రబాబు ఏడు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా 20 దేశాల నుంచి హాజరయ్యే తెలుగు ప్రజలతో 'తెలుగు డయాస్పోరా' వేదికగా సమావేశం కానున్నారు.
Chandrababu
Andhra Pradesh investments
Davos WEF
World Economic Forum
AP new policies
Green energy Andhra Pradesh
Quantum Valley Amaravati
AP tourism
Nara Lokesh
AP economic development

More Telugu News