Chandrababu Naidu: దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Chandrababu Revanth Reddy off to Davos for Investments
  • దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు, రేవంత్
  • పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటన
  • కాసేపట్లో జ్యూరిచ్ చేరుకోనున్న చంద్రబాబు

తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. నిన్న అర్ధరాత్రి చంద్రబాబు దావోస్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన జ్యూరిచ్ చేరుకోనున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ దావోస్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కీలక చర్చలు జరపనున్నారు. 


భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలపై చంద్రబాబు చర్చిస్తారు. స్విట్జర్లాండ్‌, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. తొలుత జ్యూరిచ్‌లో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన దావోస్‌కు వెళ్తారు. 

దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో పాటు, వివిధ శాఖల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమై చర్చిస్తారు. టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తోనూ సమావేశమవుతారు. మొత్తంగా దావోస్‌లో నాలుగు రోజల పాటు పర్యటించనున్న చంద్రబాబు.. 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


మరోవైపు, ఈ ఉదయం మేడారం వనదేవతల దర్శనం పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి... అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయల్దేరారు. 


ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యాపారానికి అనుకూల వాతావరణాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించనున్నారు.


ఈ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. మేడారం అమ్మవార్ల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ విదేశీ పర్యటన తెలంగాణకు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకువస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Chandrababu Naidu
Revanth Reddy
Davos
World Economic Forum
AP CM
Telangana CM
Investments
Nara Lokesh
TG Bharat
Telangana Investments

More Telugu News