ఇమ్రాన్ హష్మీ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ 'తస్కరీ:ది స్మగ్లర్స్ వెబ్ '. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన సిరీస్ ఇది. 7 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను రూపొందించారు. నీరజ్ పాండే .. రాఘవ్ జైరత్ .. బీఏ ఫిదా  ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. హిందీతో పాటు వివిధ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 14వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో  స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: అర్జున్ మీనా (ఇమ్రాన్ హష్మీ)  ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. అతనితో కలిసి రవీందర్ గుజ్జర్ (నందీశ్ సంధు) మిథాలి ( అమృత) పనిచేసేవారు. అయితే కొన్ని కారణాల వలన, ఈ ముగ్గురూ సస్పెన్షన్ లో ఉంటారు. అలాంటి ఈ ముగ్గురిపై ఒకేసారి సస్పెన్షన్ ఎత్తేస్తారు. అందుకు కారకుడు ప్రకాశ్ కుమార్ (అనురాగ్ సిన్హా). ముంబైలో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ గా ఆయన కొత్తగా చేరతాడు. సిన్సియర్ ఆఫీసర్ గా అతనికి మంచి పేరు ఉంటుంది.

అర్జున్ మీనా నాయకత్వంలో ప్రకాశ్ కుమార్ ఒక టీమ్ ను ఏర్పాటు చేస్తాడు. బడా చౌదరి (శరద్ ఖేల్కర్) సిండికేట్, ముంబై ఎయిర్ పోర్టు ద్వారా చేస్తున్న స్మగ్లింగ్ ను అరికట్టడమే తమ ముఖ్యమైన విధి అని అర్జున్ మీనాతో ప్రకాశ్ కుమార్ చెబుతాడు. అప్పటి నుంచి ముంబై విమానాశ్రయం నుంచి తరలించబడుతున్న బంగారం .. ఖరీదైన వాచ్ లు .. బ్యాగులు పట్టుకోవడం మొదలుపెడతారు. దాంతో బడా చౌదరి తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. 

స్మగ్లర్స్ కి సంబంధించిన కదలికల గురించి రవీందర్ గుజ్జర్ కి ఒక వ్యక్తి రహస్య సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు. అలాగే అర్జున్ మీనాకి ప్రియా (జోయా) సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. బడా చౌదరికి సంబంధించిన 1200 కోట్ల బంగారాన్ని పట్టుకోవడానికి కస్టమ్స్ ఆఫీసర్స్ ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అర్జున్ మీనా టీమ్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? రవీందర్ గుజ్జర్ కి రహస్య సమాచారాన్ని అందిస్తున్న వ్యక్తి ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: కస్టమ్స్ ఆఫీసర్స్ నేపథ్యంలో కథలు రావడం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా కథలను రూపొందించడం చాలా కష్టమైన విషయమనే అనాలి. ఇలాంటి ఒక నేపథ్యానికి సంబంధించిన కథలను నిర్మించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అందుకు అవసరమైన ఒక సెటప్ ను ఏర్పాటు చేసుకోవడమే సవాల్ గా మారుతుంది. అయినా ఈ మేకర్స్ ధైర్యంగా ముందుకు వెళ్లడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి.

ప్రధానమైన పాత్రలు .. ఆ పాత్రల నేపథ్యాలు .. ఆ పాత్రల స్వరూప స్వభావాలను దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. టన్నుల కొద్దీ బంగారాన్ని అక్రమంగా తరలించేవారు ఏ స్థాయిలో ఉంటారు? వాళ్ల విలాసవంతమైన జీవితం .. వారి నెట్ వర్క్ ఏ స్థాయిలో ఉంటుందనేది చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అటు స్మగ్లర్స్ లోను .. ఇటు కస్టమ్స్ లోను రంగులు మార్చేవారు ఎలా ఉంటారనేది చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. 

స్మగ్లింగ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది? బంగారం ఎన్ని రూపాలను మార్చుకుని కస్టమ్స్ కళ్లు కప్పుతుందనేది చూపించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. స్మంగ్లింగ్ ఇన్ని రకాలుగా జరుగుతుందా అని ఆశ్చర్యపోయే స్థాయిలో చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే పాత్రల సంఖ్య పెరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఆ పాత్రలు లేకపోయినా ఎలాంటి నష్టం లేదు కూడా. బలమైన కథాకథనాలు .. భారీతనం ఉన్న సిరీస్ గా చెప్పుకోవచ్చు.

పనితీరు: నిజానికి ఇది చాలా విస్తృతమైన పరిధి కలిగిన కథ. ఒక వైపున నేరసామ్రాజ్యం .. వారు సాగించే స్మగ్లింగ్, వాళ్లతో బేరం కుదుర్చుకున్న కస్టమ్స్ .. నిజాయితీ పరులైన కస్టమ్స్. ఈ మధ్యలో తమ జీవితాలను పణంగా పెట్టి కొరియర్స్ గా మారే సాధారణ వ్యక్తులు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ కలిగిన సిరీస్ గా దీనిని తీర్చిదిద్దడంలో దర్శకులు గట్టి కసరత్తు చేశారని అనిపిస్తుంది. 

కస్టమ్స్ సూపరింటెండెంట్ గా ఇమ్రాన్ హష్మీ .. కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ గా అనురాగ్ సిన్హా .. స్మగ్లింగ్ ముఠాకి నాయకుడిగా శరద్ ఖేల్కర్ నటన ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకపోవడం కనిపిస్తుంది. అద్వైత్ నేపథ్య సంగీతం .. ప్రవీణ్ ఎడిటింగ్ .. సుధీర్ - అరవింద్ కెమెరా పనితనం మంచి మార్కులు కొట్టేస్తాయి.

ముగింపు: ఇది 7 ఎపిసోడ్స్ కలిగిన సిరీస్. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 50 నిమిషాల వరకూ ఉంటుంది. కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. ట్విస్టులు .. భారీతనం ఉన్న సిరీస్ ఇది.  ఎక్కడా బోర్ అనిపించకుండా ఆసక్తికరంగా సరిపోతుంది. కొన్ని పాత్రలు మాత్రం  అనవసరమనిపిస్తాయంతే.