Gold-Silver Prices: ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి చేరిన పసిడి, వెండి

Donald Trump Remarks Impact Gold and Silver Prices Reach Record High
  • యూరప్ దేశాలపై కొత్త సుంకాలంటూ ట్రంప్ బెదిరింపులే ప్రధాన కారణం
  • ఎంసీఎక్స్ లో తులం బంగారం ధర రూ. 1.44 లక్షలకు చేరిన వైనం
  • రూ. 3 లక్షలు దాటిన కేజీ వెండి ధర 
  • సురక్షిత పెట్టుబడిగా బంగారంలోకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు
సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఈరోజు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరాయి. గ్రీన్‌లాండ్ వివాదం నేపథ్యంలో పలు యూరోపియన్ దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు పరుగులు పెట్టారు. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా పసిడి, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి.

దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి ఫ్యూచర్స్ బంగారం ధర 1.68 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,44,905 పలికింది. అలాగే మార్చి ఫ్యూచర్స్ వెండి ధర ఏకంగా 4.39 శాతం వృద్ధితో కేజీకి రూ. 3,00,400 వద్ద ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో కూడా ఔన్స్ బంగారం ధర 1.6 శాతానికి పైగా పెరిగి 4,700 డాలర్ల స్థాయిని తాకింది.

గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికాను అనుమతించే వరకు యూరప్‌లోని ఎనిమిది దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగి, వారు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం, వెండి వైపు మళ్లించారు.

రాజకీయ అస్థిరత, అమెరికా ద్రవ్య విధానంపై నెలకొన్న సందేహాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడ్డాయని మెహతా ఈక్విటీస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కలాంత్రి తెలిపారు. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ వంటి రంగాల్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ కూడా దాని ధరల పెరుగుదలకు కార‌ణ‌మ‌వుతోంది. డాలర్ ఇండెక్స్‌లోని ఒడుదొడుకులు, సుంకాలపై యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ వారం కూడా బులియన్ మార్కెట్ లో ఒడుదొడుకులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Gold-Silver Prices
Donald Trump
Gold price
Silver price
MCX
Greenland
Tariffs
Investment
Commodity market
Rahul Kalantri
US Supreme court

More Telugu News