దావోస్ కు బయల్దేరిన రేవంత్ రెడ్డి
- దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న రేవంత్
- పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటన
- వనదేవతల దర్శనం పూర్తి చేసుకుని స్విట్జర్లాండ్ పయనం
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈ ఉదయం మేడారం వనదేవతల దర్శనం పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి... అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయల్దేరారు.
ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యాపారానికి అనుకూల వాతావరణాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించనున్నారు.
ఈ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. మేడారం అమ్మవార్ల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ విదేశీ పర్యటన తెలంగాణకు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకువస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.