ఆ దొంగ... అలా దొరికిపోయాడు!

  • కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో ఘటన 
  • తిరిగి వెళ్లే మార్గం లేక లోపలే వుండిపోయిన వైనం 
  • దొంగను పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు 
కామారెడ్డి జిల్లాలో ఒక విచిత్రమైన చోరీ ఘటన జరిగింది. దొంగతనానికి వచ్చిన ఒక వ్యక్తి, తిరిగి వెళ్ళే మార్గం లేక అక్కడే నిద్రపోయి, చివరికి ఇంటి యజమానులకు చిక్కాడు.

బీర్కూర్ మండలం, రెండవ వార్డులోని మాలిపటేల్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక దొంగ ఇంటి వెనుక గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. వంటగది, పూజ గదిలో ఉన్న వస్తువులతో పాటు కొంత డబ్బును ఒక సంచిలో నింపుకున్నాడు. అయితే, వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళడం సాధ్యం కాకపోవడంతో బయటపడలేకపోయాడు. దీంతో అతను లోపలి నుండి గడియ వేసుకొని ఇంట్లోనే నిద్రపోయాడు.

సాయంత్రం దేవుడికి దీపం పెట్టడానికి ఇంటి యజమానులు తాళం తీయగా, లోపల గడియ సరిగా లేకపోవడంతో తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడే లోపల దొంగ నిద్రపోతూ కనిపించాడు. భయాందోళనలకు గురైన ఇంటి యజమానులు వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్థులు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించగా, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News