మీరు, మీరు చూసుకోండి... మా మంత్రుల జోలికి రావొద్దు: మీడియాకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • మీడియా సంస్థల మధ్య గొడవలుంటే తలుపులు మూసుకొని కొట్టుకోవాలన్న సీఎం రేవంత్
  • మంత్రులను బద్నాం చేయవద్దు, రాసేముందు తన వివరణ తీసుకోవాలని సూచన
  • సింగరేణి టెండర్లలో అవినీతికి తావులేదు, అనుభవం ఉన్నవారికే కాంట్రాక్టులు అని స్పష్టం
  • అయోధ్యలా భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు
  • ఖమ్మంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సంస్థలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తమ మంత్రుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు రాయవద్దని, మీడియా సంస్థల మధ్య ఏవైనా గొడవలుంటే తలుపులు మూసుకుని కొట్టుకోండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో కుంభకోణం జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏదులాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "మీకు గొడవలుంటే మీరు, మీరు చూసుకోండి. మా మంత్రుల జోలికి మాత్రం రావొద్దు. ఏదైనా రాసేముందు నన్ను వివరణ అడగండి, నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. అంతేకానీ మా మంత్రులను బద్నాం చేయొద్దు. వారిపై వార్తలు వస్తే నా గౌరవానికి భంగం కలుగుతుంది" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మీడియా సంస్థల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ నేతలు బలపడేలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆ రెండు మీడియా సంస్థలకు హితవు పలికారు.

అనంతరం సింగరేణి అంశంపై మాట్లాడుతూ, కొన్ని పత్రికలు బొగ్గు మాయమైందని, కుంభకోణం జరిగిందని అసత్యాలు రాస్తున్నాయని విమర్శించారు. "సింగరేణి టెండర్లను అనుభవం ఉన్న సంస్థలకే ఇస్తాం. ఇందులో ఏ మాత్రం అవినీతికి తావు లేదు. మా రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలు జరగలేదు" అని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు చేసుకున్న రేవంత్, జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఆ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు పొందాలంటే ఎవరో ఒకరు చనిపోవాల్సిన దుస్థితి ఉండేదని, కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే, తాము ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని, వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ స్ఫూర్తితో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు కేటాయించామని చెప్పారు.

భద్రాచలం అభివృద్ధిపై మాట్లాడుతూ, కేసీఆర్ రూ.100 కోట్లు ఇస్తానని మాట తప్పారని, తమ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి అయోధ్య తరహాలో భద్రాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతుందని హామీ ఇచ్చారు. మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నారని, రాబోయే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News