ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: భట్టి విక్రమార్క

  • నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్ల విషయంలో ఓ పత్రికలో అడ్డగోలు రాతలంటూ ఫైర్
  • కట్టుకథలకు భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదన్న డిప్యూటీ సీఎం
  • ప్రభుత్వ వనరులు ప్రజలకు సమానంగా పంచడమే తన లక్ష్యమని వెల్లడి
కట్టుకథలు, పిట్ట కథలు అల్లి ప్రజలను మభ్య పెట్టేలా కథనాలు ప్రచురిస్తే భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ పత్రికపై మండిపడ్డారు. నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తనపై ఆరోపణలు గుప్పిస్తూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై భట్టి స్పందించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్తుల సంపాదన కోసమో, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను, వనరులను ప్రజలకు సమానంగా పంచడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. 
 
"నైనీ బొగ్గు బ్లాక్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించాం. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థే తప్ప మంత్రి కాదు. గనులు ఉన్న ప్రాంతం క్లిష్టమైనది కావడంతో ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. సింగరేణి ప్రజల ఆస్తి.. బొగ్గు గనులు ప్రజల ఆత్మగౌరవం. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతాను. మీడియా సంస్థల మధ్య ఉన్న విషయాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దు.

వ్యక్తిత్వాన్ని హననం చేసే కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదు. ఆ మీడియా కథనంలో నా పేరును అనవసరంగా తీసుకువచ్చారు. ఆ పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తా. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిపై ఉన్న కోపాన్ని ఆయన సన్నిహితుడినైన నాపై చూపిస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కట్టుకథలు రాశారు. ఈ కట్టుకథలకు భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదు" అని భట్టి విక్రమార్క అన్నారు.


More Telugu News