బీహార్‌లో గెలిచాం.. బెంగాల్‌కు సమయం ఆసన్నమైంది: నరేంద్ర మోదీ

  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమత ప్రభుత్వం విఫలమైందని విమర్శ
  • బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న నరేంద్ర మోదీ
  • కేంద్రం ఇస్తున్న నిధులను మమతా బెనర్జీ కొల్లగొడుతోందని విమర్శ
బీహార్‌లో ఎన్డీయే విజయం సాధించిందని, ఇక పశ్చిమ బెంగాల్‌కు సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ పర్యటనలో భాగంగా మాల్దాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను మమతా బెనర్జీ ప్రభుత్వం కొల్లగొడుతోందని మోదీ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి హింస, బుజ్జగింపు రాజకీయాలు కావాలని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

రాష్ట్రానికి అసలైన సవాల్ చొరబాటుదారులేనని మోదీ పేర్కొన్నారు. చొరబాట్లను అరికట్టడంలో తృణమూల్ ప్రభుత్వం విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. మాల్దా, ముర్షీదాబాద్ వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగడానికి చొరబాట్లే కారణమని ఆయన ఆరోపించారు. బెంగాల్ రాష్ట్రానికి వరద సహాయ నిధులను కేంద్రం 40 సార్లు అందించినా, ఆ నిధులు అసలైన లబ్ధిదారులకు చేరలేదని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు.




More Telugu News