పవార్, థాకరే కుటుంబాలు కలిసినా... మహారాష్ట్రలో సత్తా చాటుతున్న బీజేపీ

  • పుణే, పింప్రీ-చించ్‌వడ్ కార్పొరేషన్లలో కలిసి పోటీ చేసిన పవార్ కుటుంబం
  • రెండు చోట్లా సత్తా చాటుతున్న బీజేపీ
  • బీఎంసీ ఎన్నికల్లోనూ సుమారు 90 స్థానాల్లో ముందంజలో బీజేపీ
మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పవార్, థాకరే కుటుంబాలకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న విషయం విదితమే. ఈ ఎన్నికల కొన్ని ప్రాంతాల్లో పవార్ కుటుంబాలు, రెండు దశాబ్దాల అనంతరం థాకరే కుటుంబాలు కలిసి పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. బీజేపీ మాత్రం తన పట్టును నిలుపుకుంటోంది. పుణే, పింప్రీ-చించ్‌వడ్ మున్సిపల్ కార్పొరేషన్లలో పలు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి.

పుణేలోని 165 వార్డుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు ప్రకారం బీజేపీ సుమారు 60 స్థానాల్లో, ఎన్సీపీ ఐదు, ఎన్సీపీ (ఎస్పీ) రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పింప్రి-చించ్‌వాడ్ కార్పొరేషన్‌లో మొత్తం 127 వార్డులు ఉండగా, బీజేపీ 70కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్సీపీ 39 స్థానాల్లో, ఎన్సీపీ (ఎస్పీ) ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

బీఎంసీ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులు ఉండగా, బీజేపీ సుమారు 90 స్థానాల్లో, శివసేన 31 స్థానాల్లో, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 63 స్థానాల్లో, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.


More Telugu News