పవన్ కల్యాణ్ కు సెల్యూట్ చేస్తున్నానంటూ బాలీవుడ్ హీరో ట్వీట్... స్పందించిన పవన్

  • పవన్ కల్యాణ్‌ను గ్రాండ్‌మాస్టర్ అంటూ కొనియాడిన విద్యుత్ జమ్వాల్
  • బాలీవుడ్ హీరో ప్రశంసలకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ కళాకారుల మధ్య ఆసక్తికర సంభాషణ
  • కళరిపయట్టును ప్రోత్సహిస్తున్న విద్యుత్‌ను అభినందించిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ప్రశంసల వర్షం కురిపించారు. మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ నైపుణ్యాన్ని కొనియాడుతూ ఆయన్ను ‘గ్రాండ్‌మాస్టర్’ అని సంబోధించారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా అంతే హుందాగా స్పందించారు. వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

"మాస్టర్ పవన్ కల్యాణ్, గ్రాండ్‌మాస్టర్‌గా మీ ఉన్నతికి నా సెల్యూట్. మీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తూ క్రమశిక్షణ, యోధ స్ఫూర్తిని అందిస్తోంది" అని విద్యుత్ జమ్వాల్ తన పోస్టులో పేర్కొన్నారు. విద్యుత్ కూడా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యుడు కావడంతో ఆయన అభినందనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ ప్రశంసలకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ స్పందించారు. "డియర్ విద్యుత్ జమ్వాల్, మీ ఉదారమైన మాటలకు ధన్యవాదాలు. మార్షల్ ఆర్ట్స్‌కు కట్టుబడి ఉన్న మీలాంటి వారి నుంచి ఈ మాటలు రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మన సంప్రదాయ యుద్ధ కళ కళరిపయట్టును ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం. క్రమశిక్షణ, వారసత్వం, యోధ స్ఫూర్తిని గౌరవించడానికి సినిమాను ఇంత నిజాయతీగా ఉపయోగించడం అభినందనీయం. మీ తదుపరి ప్రాజెక్టులకు శుభాకాంక్షలు" అని పవన్ బదులిచ్చారు.



More Telugu News