పాలించడానికి మీరు అర్హులేనా?: చంద్రబాబుపై జగన్ ఫైర్

  • సాల్మన్ హత్యపై ఏం సమాధానం చెపుతారంటూ చంద్రబాబుకు జగన్ ప్రశ్న
  • అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి కుట్ర చేస్తున్నారని మండిపాటు
  • మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక

గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షలతో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబును  ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నలు సంధించారు.


“చంద్రబాబు... మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం, రాజకీయ పాలన ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా?” అంటూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, దళిత యువకుడు మందా సాల్మన్ హత్యపై మీరు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి సొంత గ్రామానికి వచ్చిన సాల్మన్‌ను ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేయడం అమానుషమని అన్నారు. ఈ ఘటన పూర్తిగా వైసీపీ కార్యకర్తలను భయపెట్టేందుకు అధికార పార్టీ నేతలు, కొంతమంది పోలీసులు కలిసి చేస్తున్న కుట్రేనని జగన్ ఆరోపించారు.


ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, తమకు నచ్చని వారిని బెదిరించడం, హత్యా రాజకీయాలకు పాల్పడటం వల్లే పిన్నెల్లి గ్రామం నుంచి వందలాది వైసీపీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పల్నాడు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.


ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తోందని జగన్ విమర్శించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా జీవించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవడం మాత్రమే కాకుండా, కక్షల కోసం శాంతిభద్రతలను దెబ్బతీస్తూ హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం ఘోరమైన నేరమని అన్నారు. ఇది స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంటూ, హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.



More Telugu News