హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. స్పందించిన నటుడు హర్షవర్ధన్

  • స్వేచ్ఛలో దుస్తులు ఒక భాగం.. దుస్తులు మాత్రమే స్వేచ్ఛ కాదన్న హర్షవర్ధన్
  • దొంగల మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడం ఉత్తమమని వ్యాఖ్య
  • శివాజీ మాట్లాడిన తీరు మాత్రమే తప్పన్న హర్షవర్ధన్
నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్‌ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు హర్షవర్ధన్ స్పందించారు. శివాజీ మాట్లాడిన తీరు మాత్రమే తప్పని, ఆయన అభిప్రాయం సరైనదేనని అన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ మాట్లాడుతూ, స్వేచ్ఛలో దుస్తులు ఒక భాగమని, కానీ దుస్తులు మాత్రమే స్వేచ్ఛ కాదని గుర్తించాలని వ్యాఖ్యానించారు.

దుస్తుల గురించి హర్షవర్ధన్ మాట్లాడుతూ, దొంగల మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడం ఉత్తమమని, తాళం వేసుకోవడం తన చేతిలోనే ఉన్న పని అని వెల్లడించారు. తన ఇంట్లో వాళ్లకు జాగ్రత్తగా ఉండమని చెప్పడం సులభమని తెలిపారు. కానీ దొంగలకు మాత్రం దొంగతనం చేయవద్దని, తాము లేని సమయంలో ఒంటరిగా ఉన్న వాళ్ల మీద దాడి చేయవద్దని చెప్పడం చాలా కష్టమైన పని అన్నారు.

కొన్ని రోజులుగా దుస్తుల వేషధారణ, శివాజీ వ్యాఖ్యలపై చర్చ సాగుతోందని, కానీ రెండు అంశాలను ఎప్పుడూ కలపకూడదని అన్నారు. స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు దాని పైనే దృష్టి సారించాలని, అదే సమయంలో దుస్తుల గురించి మాట్లాడినప్పుడు వాటి గురించే ఆలోచించాలని అన్నారు.

మంచి ఉద్దేశంతో ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు మాట్లాడే తీరు సరిగ్గా ఉండాలని హితవు పలికారు. స్వేచ్ఛ అంటే చాలా రకాలుగా ఉంటుందని పేర్కొన్నారు. చదువు, బంధాలు, మనకు కావాల్సిన ఆహారం తినడం, మనం చూడాలనుకున్న ప్రదేశాలకు వెళ్లడం ఇవన్నీ స్వేచ్ఛలో భాగమే అన్నారు.

ఇందులోనే మనకు కావాల్సిన దుస్తులు వేసుకోవడం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఆధునిక దుస్తులు ధరించడమే స్వేచ్ఛ కాదని గుర్తించాలని అన్నారు. ఇష్టారీతిన దుస్తులు ధరించినప్పుడు స్వేచ్ఛ అనే పదాన్ని ఉపయోగించకూడదని అన్నారు. మనం ఉండే ప్రదేశాన్ని బట్టి మన వేషధారణ ఉండాలని వ్యాఖ్యానించారు.


More Telugu News