డెలివరీ బాయ్ 'దావత్': కిందకు రాలేనన్న కస్టమర్.. పార్సిల్ ఫుడ్ తినేసిన జొమాటో ఏజెంట్

  • కిందకు రాలేనన్న కస్టమర్‌తో డెలివరీ ఏజెంట్ వివాదం
  • బైక్ భద్రత దృష్ట్యా పైకి రాలేనన్న ఏజెంట్
  • ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో కస్టమర్ ముందే ఫుడ్ తినేసిన ఏజెంట్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో  
అర్ధరాత్రి ఫుడ్ డెలివరీ విషయంలో కస్టమర్‌తో వివాదం తలెత్తడంతో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ ఆ ఆర్డర్‌ను తానే తినేశాడు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ సంఘటన డెలివరీ ఏజెంట్ల భద్రత, కస్టమర్ల అంచనాలపై పెద్ద చర్చకు దారితీసింది.

అంకుర్ ఠాకూర్ అనే జొమాటో డెలివరీ పార్ట్‌నర్ తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లాడు. తన వాహనాన్ని కింద వదిలి పైకి వస్తే దొంగతనం జరగవచ్చనే భయంతో కస్టమర్‌ను కిందకు వచ్చి ఆర్డర్ తీసుకోమని కోరారు. అయితే, డోర్‌స్టెప్ డెలివరీ కోసం డబ్బులు చెల్లించామని చెబుతూ కస్టమర్ అందుకు నిరాకరించారు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కస్టమర్ తనతో దురుసుగా మాట్లాడారని, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని బెదిరించాడని ఏజెంట్ వీడియోలో ఆరోపించాడు. "ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ అయింది, కాబట్టి ఈ ఫుడ్ నేనే తినేస్తున్నా" అని చెబుతూ బిర్యానీ కాంబోలోని గులాబ్ జామూన్‌ను తింటూ వీడియో రికార్డ్ చేశాడు.

అంకుర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు పైగా వ్యూస్ సాధించి, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. డెలివరీ ఏజెంట్ల భద్రత, పని పరిస్థితులపై కొందరు సానుభూతి తెలుపుతుండగా, డోర్‌స్టెప్ సర్వీస్‌కు డబ్బులు చెల్లించినప్పుడు కస్టమర్ కిందికి రావలసిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. 

జొమాటో పాలసీ ప్రకారం.. కస్టమర్ అందుబాటులో లేకపోయినా లేదా లొకేషన్ దగ్గరకు రావడానికి నిరాకరించినా డెలివరీ ఏజెంట్ కొంత సమయం వేచి చూసి ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది. అయితే, కొన్ని అపార్ట్‌మెంట్లలో అర్ధరాత్రి వేళ డెలివరీ బాయ్స్‌ను లోపలికి అనుమతించరు. ఈ విషయంలో ఏజెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఒక వర్గం అంటుంటే, కస్టమర్ డబ్బులు చెల్లించినప్పుడు ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వాలనేది మరో వర్గం వాదన.

"ఆకలితో ఉన్న డెలివరీ బాయ్‌కు మంచి భోజనం దొరికింది" అంటూ కొందరు చమత్కరిస్తుంటే, మరికొందరు మాత్రం జొమాటో సర్వీస్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, చిన్నపాటి మొండితనం వల్ల కస్టమర్ తన భోజనాన్ని కోల్పోగా, డెలివరీ ఏజెంట్ మాత్రం ఆ ఆహారంతో తన ఆకలి తీర్చుకున్నాడు. ఈ ఘటనపై జొమాటో సంస్థ నుంచి గానీ, సంబంధిత కస్టమర్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


More Telugu News