పాక్ మందులకు ఆఫ్ఘన్ 'చెక్‌': మార్కెట్‌ను ముంచెత్తుతున్న మేడ్ ఇన్ ఇండియా డ్రగ్స్

  • పాకిస్థాన్ నుంచి ఔషధాల దిగుమతిపై తాలిబన్ల నిషేధం
  • 70 శాతం వాటాను కోల్పోయిన ఇస్లామాబాద్
  • భారత కంపెనీలతో భారీ ఒప్పందాలు
ఆఫ్ఘనిస్థాన్ ఔషధ మార్కెట్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న పాకిస్థాన్ ఆధిపత్యానికి తెరపడుతోంది. గతంలో ఆఫ్ఘన్ మార్కెట్‌లో 70 శాతం వాటా కలిగిన పాక్ మందుల స్థానాన్ని ఇప్పుడు భారతీయ ఔషధాలు వేగంగా భర్తీ చేస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వానికి, పాకిస్థాన్‌కు మధ్య సరిహద్దు వివాదాలు ముదరడం.. అదే సమయంలో భారత మందులు నాణ్యతతో పాటు చౌకగా లభిస్తుండటంతో ఆఫ్ఘన్ ప్రజలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు.

తాజాగా ఒక ఆఫ్ఘన్ వ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఈ మార్పును కళ్లకు కడుతోంది. ఒకప్పుడు పాకిస్థాన్ లేదా టర్కీ నుంచి వచ్చే పారాసిటమాల్ వంటి సాధారణ మాత్రల కోసం 40 ఆఫ్ఘనీలు (స్థానిక కరెన్సీ) ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు అవే మందులు భారత కంపెనీల నుంచి కేవలం 10 ఆఫ్ఘనీలకే అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ధర మాత్రమే కాకుండా, భారతీయ మందులు త్వరగా పనిచేస్తున్నాయనే నమ్మకం స్థానిక ప్రజల్లో పెరగడం పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం భారత్‌తో వైద్య రంగంలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల భారత ఫార్మా దిగ్గజం 'జైడస్ లైఫ్‌సైన్సెస్', ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రౌఫీ గ్లోబల్ గ్రూప్‌తో సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 830 కోట్లు) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి మందులు సరఫరా చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఔషధ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి భారత్ సాంకేతిక సహకారం అందించనుంది.

సరిహద్దులో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ నుంచి వచ్చే మందులపై తాలిబన్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. ఫిబ్రవరి నాటికి ఈ దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని డెడ్ లైన్ విధించడంతో పాక్ ఫార్మా రంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇదే సమయంలో భారత్ పంపిన టన్నుల కొద్దీ వైద్య సహాయం, వ్యాక్సిన్లు, అత్యాధునిక మెడికల్ ఎక్విప్‌మెంట్ (CT స్కాన్ మెషీన్లు వంటివి) కాబూల్‌లోని ఆసుపత్రులకు చేరుకున్నాయి. రాజకీయంగా గుర్తింపు లేకపోయినా, మానవతా దృక్పథంతో భారత్ చేస్తున్న ఈ సాయం ఇప్పుడు ఆ దేశంలో ఇండియా బ్రాండ్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది.  


More Telugu News