తమిళ మహిళలతో పోలుస్తూ ఉత్తరాది మహిళలపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • తమిళ మహిళలను చదువుకోమని మేం చెబుతామన్న దయానిధి మారన్
  • ఉత్తరాది మహిళలను మాత్రం వంటకే పరిమితం చేస్తారని వ్యాఖ్య
  • దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేపాయి. తమిళనాడులో అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తుంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో వారిని వంటింటికే పరిమితం చేస్తూ బానిసలుగా చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతూ, మారన్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

అసలేం జరిగిందంటే..

చెన్నైలోని క్వాయిద్-ఎ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాలలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో దయానిధి మారన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "ఉలగమ్ ఉంగళ్ కైయిల్" (ప్రపంచం మీ చేతుల్లో) పథకం కింద ఫైనల్ ఇయర్ విద్యార్థినులకు 900 ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దయానిధి మారన్ మాట్లాడుతూ.. తమిళనాడులో ద్రావిడ మోడల్ పాలన వల్లే మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత లభిస్తోందన్నారు. పెరియార్, కరుణానిధి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వంటి నేతల కృషి వల్లే ఇక్కడి అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతున్నారని కొనియాడారు. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లోని పరిస్థితులను పోలుస్తూ, "ఉత్తరాది రాష్ట్రాల్లో అమ్మాయిలను ఉద్యోగాలకు వెళ్లొద్దని చెబుతారు. ఇంట్లోనే ఉండి, వంటపని చేసుకుని, పిల్లల్ని కనమని చెబుతారు. కానీ ద్రావిడ రాష్ట్రమైన తమిళనాడులో మీ అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాం" అని అన్నారు. అంతేకాకుండా, "ఇంగ్లీష్ నేర్చుకోవద్దని, అది నేర్చుకుంటే నాశనమైపోతారని చెబుతారు.  బానిసలుగా ఉంచుతారు" అని కూడా వ్యాఖ్యానించారు.

భగ్గుమన్న బీజేపీ

దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత తిరుపతి నారాయణన్ మాట్లాడుతూ, "దయానిధి మారన్‌కు కనీస ఇంగితజ్ఞానం ఉందని నేను అనుకోవడం లేదు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశ ప్రజలకు, ముఖ్యంగా ఆయన చదువులేనివారిగా, అనాగరికులుగా చిత్రీకరించిన హిందీ మాట్లాడే ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు.  మరో బీజేపీ నేత అనిలా సింగ్.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి ప్రముఖ మహిళా నేతలను ప్రస్తావిస్తూ మారన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.


More Telugu News