బీజేపీతో పొత్తుపై విజయ్ పార్టీ స్పందన

  • తమిళనాడులో పెరుగుతున్న ఎన్నికల వేడి
  • డీఎంకేను ఓడించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న విజయ్
  • బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్న టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ

తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ సొంత పార్టీ టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకేను ఓడించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు, పొత్తులకు సంబంధించి పలు వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీతో విజయ్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ అంశంపై టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ పూర్తి క్లారిటీ ఇచ్చారు.  


ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ సైద్ధాంతికంగా బలమైన పునాదిపై నిలబడిందని, ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదని గట్టిగా చెప్పారు. బీజేపీతో మాకు ఎలాంటి సైద్ధాంతిక పొంతన లేదు, అందుకే ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీవీకే సొంత బలంతోనే, స్వతంత్రంగా ప్రజల ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు. 


ఇక విజయ్ తాజా సినిమా 'జన నాయగన్' సెన్సార్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన మద్దతు వ్యాఖ్యలను టీవీకే హార్దికంగా స్వాగతించింది. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్న తరుణంలో రాహుల్ మద్దతు తమకు భారీ బలాన్నిచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ "జన నాయగన్‌ను బ్లాక్ చేయడం తమిళ సంస్కృతిపై దాడి" అంటూ మోదీని టార్గెట్ చేశారు. "మోదీజీ, తమిళ ప్రజల స్వరాన్ని అణచివేయలేరు" అని ట్వీట్ చేశారు.



More Telugu News