ఏలూరు ఎంపీని బెదిరించి రూ.10 కోట్ల డిమాండ్ .. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

  • ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌, ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ను బెదిరించిన ముంబయికి చెందిన రుషాంత్‌ 
  • చర్చలకు వచ్చి ఎమ్మెల్యే పీఏని బెదిరించి డబ్బుతో ఉడాయించిన నిందితుడు  
  • ఎమ్మెల్యే పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • దక్షిణ ముంబయిలో నిందితుడిని అరెస్టు చేసి కడప జైలుకు తరలించిన వైనం
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలను బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఘటనలో ముంబయికి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకుంటూ ఈ-మెయిల్స్‌ ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేలకు బెదిరింపులకు పాల్పడిన నిందితుడు.. ఆస్తుల చిట్టాను బయటపెడతానని హెచ్చరిస్తూ, రూ.10 కోట్లు చెల్లిస్తే విషయం వదిలేస్తానని డిమాండ్ చేశాడు. లేదంటే వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించి అంతు చూస్తానంటూ పలుమార్లు బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.

వరుస బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడంతో నిందితుడిని చర్చల నిమిత్తం తన తండ్రి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ పీఏ ఆది వద్దకు వెళ్లమని చెప్పారు. ఈ క్రమంలో మైదుకూరుకు వచ్చిన నిందితుడు వాడ్కే.. తనను కత్తితో బెదిరించి రూ.70 వేల నగదు దోచుకుని పరారైనట్లు ఆది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిందితుడు దక్షిణ ముంబయిలో ఉన్నట్లు గుర్తించిన జిల్లా పోలీసులు, మహారాష్ట్ర పోలీసుల సహకారంతో అతడిని అరెస్టు చేసి కడపకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించారు. ఎన్నికల సమయంలో సమర్పించిన ఆస్తుల వివరాలను ఆధారంగా చేసుకుని ఎంపీ, ఎమ్మెల్యేలను బెదిరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆర్టీఐ కార్యకర్త కాదని కూడా స్పష్టమైంది. ఈ కేసులో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఇటీవల జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


More Telugu News