అలా తింటూ కూడా ట్రంప్ ఎలా బతికి ఉన్నారో ఆశ్చర్యమే.. ట్రంప్ ఆరోగ్యంపై మంత్రి కెన్నడీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ట్రంప్ తన పర్యటనల్లో మెక్‌డొనాల్డ్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ తింటారన్న కెన్నెడీ
  • ఆరోగ్యంపై వస్తున్న ఆందోళనలను తోసిపుచ్చిన ట్రంప్
  • తాను రోజూ ఆస్పిరిన్ తీసుకుంటానని వెల్లడి
  • ట్రంప్ ఆరోగ్యం అద్భుతంగా ఉందన్న వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రమశిక్షణ, శక్తిసామర్థ్యాల గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ, పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం ఆయన డైట్ నేరుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు దారి మళ్లుతుందని స్వయంగా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ వెల్లడించారు. మంగళవారం విడుదలైన ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కెన్నెడీ ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

వైట్ హౌస్, మార్-ఎ-లాగోలో ట్రంప్ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటారని, అయితే ప్రయాణాల్లో మాత్రం కథ వేరేలా ఉంటుందని తెలిపారు. "ఆయనతో ప్రయాణించే వారు రోజంతా ఆయన విషం తీసుకుంటున్నారని భావిస్తారు" అని కెన్నెడీ వ్యాఖ్యానించారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకే ట్రంప్ తనకు నమ్మకమైన మెక్‌డొనాల్డ్స్ వంటి పెద్ద బ్రాండ్ల ఆహారాన్ని ఎంచుకుంటారని వివరించారు. అంత ఫాస్ట్ ఫుడ్ తిన్నా ట్రంప్ చాలా దృఢంగా ఉండటంపై కెన్నెడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఆయన ఓ దేవతలాంటివారు. అసలు ఎలా బతికున్నారో అర్థం కాదు" అని అన్నారు.

ఇటీవల ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ మొదలైన నేపథ్యంలో కెన్నెడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన వయసు, ఆరోగ్యంపై వస్తున్న ఆందోళనలను ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో కొట్టిపారేశారు. తాను సమావేశాల్లో నిద్రపోతున్నానన్న వార్తలను ఖండించారు. తాను రోజూ 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ తీసుకుంటానని, దానివల్ల చేతులపై గాయాల వంటివి అవుతున్నాయని, వాటిని కవర్ చేసేందుకు మేకప్ వాడుతున్నానని తెలిపారు.

మరోవైపు, 2025 అక్టోబర్‌లో జరిగిన వైద్య పరీక్షల అనంతరం ట్రంప్ ఆరోగ్యం అద్భుతంగా ఉందని అధ్యక్షుడి వైద్యుడు ప్రకటించారు. ప్రస్తుతం 79 ఏళ్ల వయసున్న ట్రంప్ పదవీకాలం ముగిసేనాటికి ఆయన వయసు 82 ఏళ్లు అవుతుంది. దీంతో అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలుస్తారు.


More Telugu News