కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్' టీజర్ పై తీవ్ర వివాదం.. అశ్లీల కంటెంట్ పై అభ్యంతరాలు!
- కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తాజా చిత్రం 'టాక్సిక్'
- 24 గంటల్లోనే టీజర్ కు 220 మిలియన్ల వ్యూస్
- టీజర్ లోని అశ్లీలతపై కర్ణాటక ఆప్ మహిళా వింగ్ నుంచి అభ్యంతరాలు
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తాజా సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’గురించి ఇప్పుడు భారీగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా టీజర్ ఈ నెల 8న యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. టీజర్ విడుదల అయిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి 24 గంటల్లోనే 220 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
టీజర్‌లో యశ్ స్టైలిష్‌గా, డేంజరస్‌గా 'రాయా' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడు. ఒక సీన్‌లో కారులో ఒక మహిళతో ఇంటిమేట్ మూమెంట్ చూపిస్తూ, వెంటనే బయట ఉన్న శత్రువులను గన్‌తో చంపేస్తారు. ఈ సీన్ చాలా బోల్డ్‌గా ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మహిళల గౌరవాన్ని తగ్గిస్తుందని, పిల్లల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని, కన్నడ సంస్కృతికి అవమానకరమని ఆరోపణలు వచ్చాయి.
ఈ వివాదం ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక విభాగం మహిళా వింగ్ నుంచి మొదలైంది. నిన్న వాళ్లు కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. “టీజర్‌లోని అశ్లీల కంటెంట్ మహిళలు, పిల్లల సామాజిక శ్రేయస్సుకు హాని చేస్తోంది. వయసుకి సంబంధించిన వార్నింగ్ లేకుండా పబ్లిక్‌లో విడుదల చేశారు. ఇది మహిళల గౌరవాన్ని తగ్గిస్తుంది. కన్నడ సంస్కృతికి అవమానం. వెంటనే టీజర్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలి. పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" అని ఆప్ స్టేట్ సెక్రటరీ ఉషా మోహన్ కోరారు. ఈ ఫిర్యాదు తర్వాత కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లేఖ రాసింది.