రోజుకు 7 గంటలు నిద్రించకుంటే ఆయుష్షు తగ్గిపోతుందట.. తాజా అధ్యయనంలో వెల్లడి

  • అమెరికన్ల నిద్ర అలవాట్లపై ఒరెగాన్ యూనివర్సిటీ పరిశోధన
  • రోజుకు కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి అంటున్న వైద్య నిపుణులు
  • కంటినిండా నిద్రపోతే అనారోగ్యాలు దూరమవుతాయని సూచన
శరీరానికి రోజంతా కలిగే అలసటను రాత్రి నిద్ర ద్వారానే అధిగమించవచ్చు. కుదిరితే రోజుకు 9 గంటలు.. లేదంటే కనీసం 7 గంటలు హాయిగా నిద్రించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే తక్కువ సమయం నిద్రిస్తే మాత్రం అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఒరెగాన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం కూడా ఇదే విషయాన్ని తేల్చింది. రోజుకు 7 గంటలకన్నా తక్కువసేపు నిద్రించే వారి ఆయువు తగ్గిపోతోందని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు హెచ్చరించారు.

స్లీప్ అడ్వాన్సెస్ లో ప్రచురించిన ఈ అధ్యయన ఫలితాలు.. కంటినిండా నిద్రిస్తే శరీరం తనకు తానుగా చికిత్స చేసుకుంటుందని, అనారోగ్యాలు దరిచేరవని పరిశోధకులు తెలిపారు. మెదడు పనితీరును, రోగనిరోధక వ్యవస్థను, జ్ఞాపకశక్తిని నిద్ర మెరుగుపరుస్తుందని వివరించారు. అంతేకాదు.. మధుమేహం వంటి దీర్ఘకాలిక ఇబ్బందులనూ దూరం పెట్టవచ్చని సూచించారు. రోజూ 7 గంటలు, వీలైతే 9 గంటల పాటు నిద్రించే వారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తెలిపారు. అంతకంటే తక్కువ సమయం నిద్రించే వారి జీవితకాలం తగ్గిపోతోందని తమ అధ్యయనంలో గుర్తించామన్నారు.

ఈ అధ్యయనం కోసం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నుంచి డాటా సేకరించామని, 2019 నుంచి 2025 వరకు అమెరికన్ల నిద్ర అలవాట్లను, వారి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించామని ఒరెగాన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్రూ మెక్ హిల్ తెలిపారు. మనుషులకు నిద్ర చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే అయినా నిద్రకు, జీవిత కాలానికి లింక్ ఉంటుందనే విషయం తాము ఊహించలేదని ఆయన చెప్పారు.


More Telugu News