Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు బాగా చెబుతారు: బండి సంజయ్

Bandi Sanjay Criticizes Revanth Reddys Promises
  • సీఎం రేవంత్‌రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారన్న బండి సంజయ్
  • ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండడం ఆర్థిక మాంద్యానికి నిదర్శనమని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఆరు గ్యారంటీలు అమలు కాలేదన్న బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు బాగా చెబుతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో నిన్న బీజేపీ జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన, రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. 
 
సీఎం రేవంత్‌రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారని, అయితే ఉద్యోగుల పట్ల నిజమైన ప్రేమ మాత్రం లేదన్నారు. రాష్ట్రంలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండడం ఆర్థిక మాంద్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఆరు గ్యారంటీలు అమలు కాలేదని బండి సంజయ్ విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పింఛన్, నిరుద్యోగులకు రూ.4,000 ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా అని నిలదీశారు. ఎన్నికల సమయంలో రూ.5 వేలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 
 
అలాగే గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనూ హామీలు అమలు కాలేదని గుర్తు చేశారు. ఆ పార్టీకి ఓటెస్తే డ్రైనేజీలో పడినట్టేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఇస్తామంటూ చెప్పే డబ్బులకు అమ్ముడుపోతే వచ్చే ఐదేళ్లు ప్రజలకు నరకమేనని బండి సంజయ్ హెచ్చరించారు.
Bandi Sanjay
Revanth Reddy
Telangana
BJP
BRS
Congress
DA
Government schemes
Elections
Financial crisis

More Telugu News