Satyaprabha: అగ్నికి ఆహుతైన గిరిజన పల్లె.. సార్లంకపల్లెలో 38 ఇళ్లు భస్మం

Fire Engulfs Tribal Village Sarlankapalle Manyam Kakinada District
  • కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఘోర అగ్నిప్రమాదం
  • క్షణాల్లో బూడిదైన పూరిళ్లు.. నిరాశ్రయులైన 120 మంది గిరిజనులు
  • పండుగ కొనుగోళ్లకు వెళ్లి వచ్చేలోపే శ్మశానంగా మారిన గ్రామం
  • కట్టుబట్టలతో మిగిలిన గిరిజనులు
కాకినాడ జిల్లా మన్యంలోని మారుమూల గ్రామం సార్లంకపల్లెలో అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. సోమవారం సాయంత్రం సంభవించిన ఈ ప్రమాదంలో నిమిషాల వ్యవధిలోనే 38 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం మూడు పక్కా ఇళ్లు మినహా ఊరంతా భస్మీపటలమైంది. ఫలితంగా 120 మంది గిరిజనులు నిలువనీడ లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.

సంక్రాంతి పండుగ కోసం సరకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులంతా సోమవారం సాయంత్రం సమీపంలోని తుని పట్టణానికి వెళ్లారు. అదే సమయంలో గ్రామంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానలంలా వ్యాపించాయి. ఊళ్లో ఉన్న కొద్దిమంది ప్రాణాలు చేతపట్టుకుని పరుగులు తీశారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న బాధితులు గ్రామానికి చేరుకునే సరికి తమ ఇళ్లు, సర్వస్వం బూడిద కుప్పలుగా మారడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

సార్లంకపల్లె మారుమూల ప్రాంతంలో ఉండటంతో సహాయక చర్యలు అందడం ఆలస్యమైంది. సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని నుంచి అగ్నిమాపక యంత్రం వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

విషయం తెలిసిన వెంటనే ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉండి అధికారులను సమన్వయం చేస్తూ గిరిజనులకు భరోసా కల్పించారు.
Satyaprabha
Sarlankapalle
fire accident
Kakinada district
tribal village
Prathipadu MLA
Andhra Pradesh
Tuni
relief measures
house fire

More Telugu News