మన జెన్-జెడ్‌లో ఎంతో సృజనాత్మకత నిండి ఉంది: నరేంద్ర మోదీ

  • 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి
  • వివేకానందుడి జీవితం, బోధనల నుంచి స్ఫూర్తితో ఈ వేదికను ప్రారంభించినట్లు వెల్లడి
  • యువత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడి
నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా దేశ యువతపై తనకు ఎప్పుడూ మంచి విశ్వాసం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన జెన్-జెడ్ తరం సృజనాత్మకతతో నిండి ఉందని ఆయన ప్రశంసించారు. 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వివేకానందుడి జీవితం, బోధనల నుంచి స్ఫూర్తి పొంది 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' వేదికను స్థాపించినట్లు తెలిపారు.

వినూత్న ఆలోచనలు, లక్ష్యాలు, ఉత్సాహంతో దేశ నిర్మాణంలో జెన్-జెడ్ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో యువత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందని అన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రారంభించిన సంస్కరణల పరంపర ఇప్పుడు సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌గా మారిందని, వీటికి కేంద్ర బిందువు యువతే అని ఆయన స్పష్టం చేశారు.

దేశ యువతకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' వేదికను రూపొందించారు. ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా యువత పాల్గొన్నారు.


More Telugu News