ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

  • ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు
  • పెరిగిన డీఏ 2024 జులై 1 నుంచి వర్తింపు
  • జనవరి నెల వేతనంతో పాటు పెరిగిన డీఏ చెల్లించనున్న ప్రభుత్వం
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం కరవు భత్యాన్ని (డీఏ) పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెరిగిన డీఏ 2024 జులై 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. జనవరి నెల జీతంతో పాటు పెరిగిన డీఏను ప్రభుత్వం ఫిబ్రవరి 1న చెల్లించనుంది. 2023 జులై 1వ తేదీ నుంచి గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది.

రైతులకు గుడ్ న్యూస్

సంక్రాంతి వేళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు కూడా శుభవార్తను అందించింది. సన్న వరిధాన్యానికి రూ.500 చొప్పున బోనస్‌ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నరకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. 

తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఈ సీజన్‌లో ప్రభుత్వం మొత్తం రూ.1,429 కోట్ల బోనస్ నిధులను విడుదల చేసింది. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకుని, మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నారు.


More Telugu News