తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత

  • తెలంగాణ రాష్ట్ర హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడలేదని విమర్శ
  • నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారన్న కవిత
  • ఏపీ ప్రభుత్వం కేంద్రం అండతో అక్రమంగా పోలవరం - నల్లమలసాగర్ నిర్మిస్తోందని ఆరోపణ
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిరక్షించలేకపోయిందని మరోసారి స్పష్టమైందని ఆమె అన్నారు.

నీటి పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో వివాదాలు వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన న్యాయపోరాటంలో ప్రతిబింబించిందని ఆమె విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు, ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం హక్కులను నిర్వీర్యం చేసిందని ఆమె ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వంలోని ఇతర ముఖ్య నాయకులకు నీటి వనరులపై అవగాహన లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి న్యాయపోరాటం చేస్తుందని, తెలంగాణ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తుందని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News