మారుతి కార్ల యజమానులకు శుభవార్త... ఇక ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ సర్వీస్ సెంటర్లు

  • దేశవ్యాప్తంగా ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో మారుతీ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు
  • వినియోగదారులకు మరింత సులభంగా అందుబాటులోకి కార్ల సర్వీసింగ్
  • కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కీలక ముందడుగు
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో సోమవారం ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఓసీఎల్ ఫ్యూయల్ రిటైల్ అవుట్‌లెట్లలో (పెట్రోల్ బంకులు) మారుతి కార్ల సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కేంద్రాల ద్వారా వినియోగదారులు తమ కార్లకు సాధారణ నిర్వహణ (రొటీన్ మెయింటెనెన్స్), చిన్నచిన్న మరమ్మతులు, ఇతర ప్రధాన సర్వీసులను కూడా పొందవచ్చని మారుతి సుజుకీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారత్న హోదా కలిగిన ఐఓసీఎల్‌కు దేశవ్యాప్తంగా 41,000 ఫ్యూయల్ స్టేషన్ల నెట్‌వర్క్ ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు తరచుగా వెళ్లే ప్రదేశాల్లోనే కార్ సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం సులభమవుతుంది. ఇప్పటికే దేశంలోని 2,882 నగరాల్లో 5,780 సర్వీస్ టచ్‌పాయింట్లను కలిగి ఉన్న మారుతీ సర్వీస్ నెట్‌వర్క్ ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుంది.

ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సర్వీస్) రామ్ సురేష్ ఆకెళ్ల మాట్లాడుతూ, "కస్టమర్లకు కార్ సర్వీసింగ్‌ను వీలైనంత సులభంగా, సౌకర్యవంతంగా మార్చడమే మా లక్ష్యం. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ అపారమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటాం" అని వివరించారు. ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ (మార్కెటింగ్) సౌమిత్రా పి. శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మా ఇంధన సేవలతో పాటు ప్రపంచస్థాయి ఆటోమోటివ్ నిర్వహణను అందిస్తుండటం సంతోషంగా ఉంది" అని తెలిపారు.



More Telugu News