యూట్యూబర్ అన్వేష్ సంచలన ప్రకటన

  • యూట్యూబ్ ఆదాయం కోసం దేశాలు తిరగబోనన్న అన్వేష్
  • ఇప్పటి వరకు రూ. 8 కోట్లు సంపాదించానని వెల్లడి
  • ఇకపై తన సంతృప్తి కోసమే ట్రావెల్ చేస్తానన్న అన్వేష్

తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో ట్రావెల్ కంటెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న 'నా అన్వేషణ' చానెల్ నిర్వాహకుడు అన్వేష్ సంచలన ప్రకటన చేశాడు. తన ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. 


ఇటీవల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, నటుడు శివాజీపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ వివాదం వల్ల చానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గింది. హిందూ సంఘాల నుంచి కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే, అన్వేష్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది.


సుమారు 130 దేశాలు చుట్టేసి, లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించిన అతడు, ఇప్పుడు వ్యూస్ కోసం లేదా యూట్యూబ్ ఆదాయం కోసం దేశాలు తిరగబోనని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు దాదాపు రూ.8 కోట్లు సంపాదించానని, జీవితం మొత్తం సంతోషంగా బతకడానికి ఆ మాత్రం డబ్బు చాలు అని స్పష్టం చేశాడు. ఇకపై వ్యక్తిగత సంతోషం కోసం మాత్రమే మిగిలిన దేశాలు సందర్శిస్తానని, సబ్‌స్క్రైబర్ల కోసం కాకుండా తన సంతృప్తి కోసమే ట్రావెల్ చేస్తానని చెప్పాడు.


అంతేకాదు, భవిష్యత్తులో ట్రావెలింగ్‌ను పక్కన పెట్టి సామాజిక అంశాలపై దృష్టి సారిస్తానని అన్వేష్ తెలిపాడు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పుతానని, ప్రాణం ఉన్నంత వరకు బాధితుల పక్షాన నిలబడతానని చెప్పాడు. 



More Telugu News