సంధ్య థియేటర్ ఘటన తర్వాత టిక్కెట్ ధరలపై ఆ మాట చెప్పింది వాస్తవమే కానీ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని గతంలో చెప్పామన్న మంత్రి
  • ఆ తర్వాత అందరం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాన్ని సవరించినట్లు వెల్లడి
  • ధరలు పెంచవలసి వస్తే కార్మికుల సంక్షేమానికి 20 శాతం ఇవ్వాలని షరతు పెట్టామన్న మంత్రి
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఆ తర్వాత అందరం కూర్చుని చర్చించి, ఆ నిర్ణయాన్ని సవరించామని తెలిపారు.

టిక్కెట్ ధరలు పెంచవలసి వస్తే, 20 శాతం సినిమా కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలనే షరతు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు కొన్ని సినిమాలకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అయితే, దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.

నల్గొండ, భువనగిరి జిల్లాలలో పర్యటిస్తున్న సమయంలో ఒక సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ జీవో వచ్చిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను మరో కార్యక్రమంలో ఉన్నానని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏ శాఖల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోరని, అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారని ఆయన వెల్లడించారు.

మంత్రి కోమటిరెడ్డి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ, ప్రస్తుతం సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానివేశానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, సినిమా టిక్కెట్ ధరల పెంపుదల కోసం తన వద్దకు రావొద్దని చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలతో కొంతమేర గందరగోళం నెలకొంది. తాజాగా తన వివరణతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు. 


More Telugu News